గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (16:03 IST)

సీఎం రేవంత్ ఇచ్చిన షాక్‌కు రాజకీయాలకు స్వస్తి చెప్పనున్న మాజీ మంత్రి మల్లారెడ్డి

భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్‌తో రాజకీయాలకు స్వస్తి పలకాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్ళపాటు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. అదేసమయంలో తాను భారాసలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 
 
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. డీకే శివకుమార్తో ఉన్న ఫోటోపై మల్లారెడ్డి స్పష్టతను ఇచ్చారు. డీకే శివకుమార్ను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు.
 
గతంలో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చెప్పారు. కానీ ఈ కూల్చివేతలు జరిగిన తర్వాత కేటీఆర్‌ను కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. అయితే ఆయన బీఆర్ఎస్‌కు కాస్త దూరంగా ఉంటున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.
 
మరోవైపు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే ఔట్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. హెచ్ఎండీఏ‌లే ఔట్‌లో 2500 గజాల స్థలం ఆక్రమించి మల్లారెడ్డి రోడ్డు వేశారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడ్చల్ కలెక్టర్ ఈ అంశంపై దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. 
 
గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ లే అవుట్లో అక్రమంగా రోడ్డు వేశారని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఆ రోడ్డును అధికారులు తొలగించారు. అలాగే, హైదరాబాద్ శివారు ప్రాంతం దుండిగల్లో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ మున్సిపల్ సిబ్బంది కూల్చేశారు.