గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (22:00 IST)

కాంగ్రెస్ అసంతృప్తులతో కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు : కడియం శ్రీహరి

kadiyam srihari
భారత రాష్ట్ర సమితి తరపున స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలిచిన మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే భారాస ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ప్రకటించారు. ఇందుకోసం ప్రస్తుతం అసెంబ్లీలోని వివిధ పార్టీలకు ఉన్న బలాబలాలను కూడా వెల్లడించారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చాయని గుర్తు చేసిన ఆయన భారాసకు 39 సీట్లు మాత్రమే వచ్చాయనని చెప్పారు. 
 
తమ మిత్రపక్షమైన ఎంఐఎంకు ఏడు సీట్లు వచ్చాయని, అలాగే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీకి మరో ఎనిమిది సీట్లు వచ్చాయన్నారు. ఇవన్నీ 54 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులతో కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. 
 
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అనేక మంది గందరగోళంలో ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం పెద్ద కష్టమైన పని కాదన్నారు. కానీ కేసీఆర్ సింహంలా వస్తారని, సమయం చెప్పలేమన్నారు. కానీ మిత్రులతో కలిసి తమ స్థానాలు 56కు చేరుకుంటాయని చెప్పారు. సింహం రెండు అడుగులు వేసిందంటే వెనక్కి వేస్తోందంటే వేటకు సిద్ధమైనట్టేనని అన్నారు. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన పార్టీ నేతలకు, శ్రేణులకు ధైర్యం చెప్పారు.