బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (09:12 IST)

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు - వారం రోజుల పాటుసాగే ఛాన్స్!!

telangana secretariat
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవి వారం నుంచి పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. సభ ప్రారంభమయ్యే తొలి రోజున కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత సభ వాయిదాపడుతుంది. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై మంగళవారమే బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఇందులో శాసనసభ నిర్వహణ తేదీలను, ఎజెండాను ఇందులో ఖరారు చేస్తారు.
 
ఈ నెల 25వ తేదీన 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూపొందించిన బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. గత డిసెంబరులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించింది. 
 
తాజాగా కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తీరును అనుసరిస్తోంది. అధికార, విపక్షాల సవాళ్లు.. ప్రతి సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు భారాస ప్రభుత్వ హయాంలో వైఫల్యాలు చోటుచేసుకున్నాయని ప్రస్తావిస్తూనే.. మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను అధికారపక్షం అసెంబ్లీలో ప్రస్తావించనుంది. 
 
ముఖ్యంగా, ఉద్యోగాల భర్తీ, డీఎస్సీ, గ్రూప్-1 నోటికేషన్ల జారీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాల అమలు తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చించనుంది. రూ.2 లక్షల రుణమాఫీ అమలుతో రైతులకు కలిగిన లబ్ధిని వివరించనుంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటించనుంది. రైతు భరోసా విధివిధానాలపైనా చర్చించనుంది.