ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (11:33 IST)

కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. వెనక్కి తగ్గేదే లేదు..

Akkineni Nagarjuna,
ప్రముఖ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపాయి. సురేఖ క్షమాపణ చెప్పినా తగ్గేది లేదని.. రూ.100 కోట్లకు మరో దావా వేస్తానని అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. 
 
పరువు నష్టం దావాను ఉపసంహరించుకోనని.. సమంతకు క్షమాపణలు చెప్తే సరిపోతుందా? తన కుటుంబం సంగతేంటని.. నాగార్జున ఓ ఆంగ్ల పత్రిక  ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు. తనపైన, తన కుటుంబంపైన అసత్య వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో వెనక్కి తగ్గేది లేదని అక్కినేని నాగార్జున చెప్పారు. ఆమె తమకు క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఇప్పటికే ఆమెపై వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాను ఉపసంహరించుకోబోమని తేల్చిచెప్పారు. 
 
ఈ వ్యవహారంపై ఓ  వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు వ్యాఖ్యలు చేశారు. కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో తాను సింహాన్ని అని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు సినీ ఇండస్ట్రీ మొత్తం తమకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిందని, ఇది తమ నాన్నగారి ఆశీర్వాదం అని నాగార్జున వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆమె చెబుతున్నారు. సమంతకు క్షమాపణ కూడా చెప్పారు. 
 
అయితే ఈ విషయంలో సీరియస్‌గా ఉన్న నాగార్జున మాత్రం కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా శుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ జరగలేదు. సోమవారం నాగార్జున పిటిషన్ పై విచారణ జరగనుంది.