కిలో చికెన్ రూ.300... కిలో చింత చిగురు రూ.500...
తెలంగాణ రాష్ట్రంలో చింత చిగురు ధర చికెన్ ధరను మించిపోయింది. కిలో చికెన్ ధర రూ.300 పలుకుతుంటే.. చింత చిగురు ధర మాత్రం ఏకంగా రూ.500 దాటిపోయింది. దీంతో గృహిణులు వామ్మో అంటో నోరెళ్లబెడుతున్నారు. దీనికి కారణం చింత చిగురు దిగుబడి గణనీయంగా తగ్గిపోవడమే.
నిజానికి వేసవి కాలంలో వచ్చే చింత చిగురుకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. యేడాదికి ఒకసారి మాత్రమే లభ్యమయ్యే ఈ చింతచిగురు తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందుకే ధరను సైతం లెక్క చేయకుండా దీన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ సారి మాత్రం చింత చిగురు ధర ఆకాశానికి తాకింది. చికెన్ ధరను మించి పలుకుతుంది. దీంతో దీనిని కొనుగోలుకు జనం ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తున్నారు.
సాధారణంగా చింతచిగురు కిలో రూ. 200 వరకు పలుకుతుంది. అయితే, ఈసారి రూ. 500కుపైగానే పలుకుతూ గుండెలు గుభేల్‌మనిపిస్తోంది. అదేసమయంలో చికెన్ కిలో రూ. 300 లోపే పలుకుతోంది. గ్రామాల్లో విరివిగా లభించే చింతచిగురుకు ఈసారి హైదరాబాద్‌లో కొరత ఏర్పడింది. రైతుబజార్‌తోపాటు మార్కెట్లలోనూ వీటి ధర బెంబేలెత్తిస్తోంది. దీంతో వినియోగదారులు 50, 100 గ్రాములకే పరిమితమవుతున్నారు. రైతు బజార్లలో 100 గ్రాముల చింతచిగురు రూ. 50కి లభిస్తుండగా బయట మార్కెట్లలో రూ.70 నుంచి 80 మధ్యలో విక్రయిస్తున్నారు.