గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (15:27 IST)

హర్యానాలో బీజేపీ ఎందుకు గెలిచింది.. కాంగ్రెస్ ఎలా ఓడిపోయింది : అసదుద్దీన్ ఓవైసీ

asaduddin
హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తమ పార్టీని బీజేపీకి బీ టీమ్‌గా వ్యాఖ్యానించే నేతలకు ఈ హర్యానా ఫలితాలు చెంపపెట్టువని ఆయన వ్యాఖ్యానించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలిచింది. కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు. హర్యానాలో మజ్లిస్ పార్టీ లేకపోయినప్పటికీ కమలం పార్టీ ఎలా గెలిచిందని ఆయన ప్రశ్నించారు. 
 
కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బీజేపీని ఏమీ చేయలేదన్నారు. తాను చెప్పే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీని ఓడించాలంటే విపక్షాలు అన్నీ ఏకం కావాలని సూచించారు. అందరినీ కలుపుకొని వెళితేనే మోడీని పరాజితుడిని చేయగలమని చెప్పారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ... మూసీ అంటూ మా వెంట ఎందుకు పడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. మూసీ నది అనంతగిరి అడవుల్లో పుట్టి వివిధ ప్రాంతాల్లో ప్రవహించి నల్గొండకు వస్తుందని గుర్తు చేశారు. కానీ సీఎం మాత్రం మూసీ పరీవాహక ప్రాంతం అంటూ కేవలం తమ వెంటే పడుతున్నారని హైదరాబాద్ నగరాన్ని ఉద్దేశించి అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.
 
మజ్లిస్ పార్టీ సహా పలు పార్టీలు బీజేపీని విమర్శిస్తుంటాయని కానీ, వాస్తవానికి ఆ పార్టీలు బీజేపీకి 'బీ' టీమ్లు అని కాంగ్రెస్ పార్టీ నేత ఉదయ్ రాజ్ ఆరోపించారు. బీజేపీ 'బీ' టీమ్ ఎవరనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీ టీమ్ పార్టీలు అక్కడకు వెళ్లి ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తాయని ఆరోపించారు.