బుధవారం, 3 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

suravaram sudhakar reddy
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి ఇకలేరు. వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన పార్థివ దేహాన్ని గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రి నుంచి మఖ్దూం భవన్‌కు తరలింసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేతలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌ నగరానికి చేరుకుని సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. సీపీఐ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు సుధాకర్‌ రెడ్డికి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు. 
 
పాలమూరు జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25వ తేదీన ఆయన జన్మించారు. 1998, 2002లో రెండుసార్లు నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. చండ్ర రాజేశ్వర్ రావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 
 
2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉస్మానియా కాలేజీ నుంచి బీఏ, ఓయూ నుంచి ఎల్ఎల్‌బీ డిగ్రీలు పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.