సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (16:05 IST)

దుర్గమ్మ నిమజ్జనం చూసొస్తానని.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన తండ్రి...

suicide
పండగ పూట తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో విషాదకర ఘటన జరిగింది. దుర్గమ్మ నిమజ్జనం చూసి వస్తామంటూ ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్లిన ఓ తండ్రి... బావిలో శవమై తేలాడు. ముక్కుపచ్చలారని పిల్లలని కూడా చూడకుండా వారిని బావిలో వేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయిగావ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి నందివాడకు చెందిన అపర్ణను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేశ్ (6), అనిరుధ్ (4). నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి వెళ్లి వస్తామంటూ ఇద్దరు కొడుకులను తీసుకుని శ్రీనివాస్ రెడ్డి వెళ్లాడు. సాయంత్రం 7:30 గంటలకు వెళ్లిన వ్యక్తి రాత్రి పది గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో 'అపర్ణ భర్తకు ఫోన్ చేసింది. అయితే, శ్రీనివాస్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన అపర్ణ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం గ్రామ శివార్లలోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు తేలాయి. శ్రీనివాస్ రెడ్డి చెప్పులు, మొబైల్ ఫోన్ బావి ఒడ్డున కనిపించాయి. అయితే ఆయన ఆచూకీ దొరకలేదు. దీంతో పిల్లల మృతదేహాలను బయటకు తీసి బావిలోని నీటిని మోటారు సాయంతో తోడించగా.. నీటి అడుగున శ్రీనివాస్ రెడ్డి మృతదేహం బయటపడింది. తండ్రీకొడుకులు బలవన్మరణంతో నందివాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.