అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ మందా జగన్నాథం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగర్ కర్నూల్ మాజీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మందా జగన్నాథం ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. మందా జగన్నాథం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ సేవలందించారు.
మందా జగన్నాథం 1951 మే 22న జన్మించిన ఆయన 1996, 1999, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. మూడు సార్లు టీడీపీ తరపున లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన 2009లో కాంగ్రెస్ తరపున నెగ్గారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు.
మందా జగన్నాథం మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడిగా మందా జగన్నాథం కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.
అటు, మందా జగన్నాథం మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలియజేశారు. మందా జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. పేద కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువులు చదివారని, తెలుగుదేశం పార్టీ తరపున మూడు సార్లు ఎంపీగా గెలిచారని చంద్రబాబు వెల్లడించారు. ఈ విషాద సమయంలో మందా జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వివరించారు.