తాట తీస్తామంటూ... డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలోని డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ నగర కొత్త పోలీస్ కమిషనరుగా నియమితులైన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీచేశఆరు. తాట తీస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమలో డ్రగ్ మాఫియా వేళ్లూనికుని పోయింది. ఈ డ్రగ్స్ మాఫియాతో పలువురు సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి వారంతా గతంలో విచారణకు కూడా హాజర్యయారు.
ఈ నేపథ్యంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అలాగే, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరుగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేయగా, ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడుతూ... డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశారు.
సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోందన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో డ్రగ్స్ మూలాలు ఉన్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సినీ పెద్దలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పబ్స్, ఫామ్ హౌస్ యజమానులు, రెస్టారెంట్లను నిర్వహించేవారు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు.