శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (20:45 IST)

ప్రేమోన్మాది దాడి.. కత్తితో దాడి.. యువతి మృతి.. ఆపై విద్యుత్‌ స్తంభం ఎక్కాడు?

crime
ప్రేమోన్మాది దాడిలో హైదరాబాద్‌ యువతి మృతి చెందింది. ఈ దారుణ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గోపన్‌పల్లి తండాలో చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో యువతి దీపన తమాంగ్‌ (25) మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేశ్‌.. మాదాపూర్‌లోని ఓ ప్రయివేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. పశ్చిమ్‌బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్‌ నల్లగండ్లలో బ్యుటీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె గోపన్‌పల్లి తండా సమీపంలో స్నేహితులతో నివాసముంటోంది. 
 
కొంతకాలంగా రాకేశ్‌తో ఆమెకు పరిచయం ఉంది. పెళ్లిచేసుకోవాలని ఏడాది నుంచి అతడు వెంటపడుతున్నాడు. దానికి దీపన నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాకేశ్ కూరగాయల కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో యువతి మృతిచెందింది. 
 
అడ్డుకునేందుకు యత్నించినా స్నేహితులపైనా దాడికి అతడు పాల్పడ్డాడు. ఆపై ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్‌ స్తంభం ఎక్కేందుకు యత్నించడంతో షాక్‌తో గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు రాకేశ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.