శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (17:03 IST)

హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమా?

Nagarjuna
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ అక్రమ నిర్మాణమా అనే చర్చ ఇపుడు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ కొరఢా ఝుళిపించేందుకు సిద్ధమవుతుంది. ఇందులోభాగంగా, జవ్వాడ ఫామ్ హౌస్ ఎఫ్.టి.ఎల్ పరిధిలో ఉండటం దీనిని కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఎఫ్.టి.ఎల్ పరిధిలోనే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది. దీంతో దీన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమా అనే చర్చ తెరపైకి వచ్చింది. 
 
మరోవైపు, జవ్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చివేయకుండా స్టే విధించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి నేత ప్రవీణ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్ పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ జవ్వాడ ఫామ్‌హౌస్ భారాస వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినగా ప్రచారం సాగుతుంది. 
 
మరోవైపు, జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇది స్వయంప్రతిపత్తిగల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణం జరిగిన 15 - 20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలని కూల్చి వేయడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది.
 
చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణార్హమైనది కాదన్నారు. ఈ ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని తెలిపారు. జీవో 111 పరిధిలోని భూములు, ఫామ్ హౌస్‌లను నీటి పారుదల శాఖ చూస్తోందన్నారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు మాత్రం లేదని ఏఏజీ తెలిపారు.