రేషనే కార్డు లేకపోయినా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు : నోడల్ ఆఫీసర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఆ రాష్ట్రంలో స్థానికత కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా, రేషన్ కార్డు లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్ కార్డు లేదన్న ఆందోళన అక్కర్లేదని నోడల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
రేషన్ కార్డు లేకపోయినా ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పదేళ్లుగా కొత్త కార్డులు జారీ చేయలేదు. దీంతో చాలామందికి రేషన్ కార్డులు లేవు. ఈ క్రమంలో వైద్య శాఖ డైరెక్టర్, ఉమ్మడి నల్గొండ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్... ప్రజలకు కీలక సూచన చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ ఈ నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేషన్ కార్డు లేని వారి సందేహాలు తీర్చే ప్రయత్నం చేశారు. రేషన్ కార్డులు లేకపోయినా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. కొత్తగా పెళ్లైన వారు కార్డులు లేవని ఆందోళన చెందవద్దన్నారు. అందరితోపాటు వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజాపాలనలో అధికారులు అందుబాటులో లేని పక్షంలో మరుసటి రోజు పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి దరఖాస్తులు అందించాలని సూచించారు. దరఖాస్తు ఇచ్చినట్లుగా వారి నుంచి రసీదు తీసుకోవాలన్నారు. అలాగే, సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ... జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన ఉంటుందన్నారు. దరఖాస్తులను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోందని... ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనుగోలు చేయవద్దని సూచించారు.