శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2024 (14:02 IST)

16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు

vande bharat sleeper
ఈ నెల 16వ తేదీ నుంచి రెండు వందే భారత్ కొత్త రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్నాయి. ఈ రెండు రైళ్లను 16వ తేదీన అహ్మదాబాద్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రెండు రైళ్లలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్, మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 
 
ఇవి తెలుగు ప్రజలకు నరేంద్ర మోడీ అందించిన వినాయక నవరాత్రుల కానుక అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధిక(తాజా రైలుతో కలిపి 5) వందేభారత్ రైళ్లు అనుసంధానం అయ్యాయన్నారు. హైదరాబాద్ నగరానికి మరో వందేభారత్ కేటాయించినందుకు ప్రధానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 16న నాగ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే రైలుకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్ స్టేషన్‌కు రావాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని ఆహ్వానించినట్టు తెలిపారు. 
 
సికింద్రాబాద్ - నాగ్‌పూర్ రైలు ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్‌లో బయలుదేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12.15కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20కి నాగ్‌పూర్‌కు చేరుకోనుంది. 578 కి.మీ. దూరాన్ని 7.20 గంటల్లో చేరుకుంటుంది. మహారాష్ట్రలోని సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్ష్.. తెలంగాణలోని రామగుండం, కాజీపేట స్టేషన్లలో రెండు నిమిషాల చొప్పున ఈ రైళ్లు ఆగుతాయి.
 
నాగ్‌పూర్ - సికింద్రాబాద్ రైలు సర్వీసు రామగుండం స్టేషన్‌కు ఉదయం 9.08, కాజీపేట స్టేషన్‍‌కు 10.04 గంటలకు చేరుకుంటుంది. అలాగే, సికింద్రాబాద్ - నాగ్‌పూర్ రైలు సర్వీసు కాజీపేటకు మధ్యాహ్నం 2.18, రామగుండం స్టేషన్‌కు 3.13 గంటలకు చేరుకుంటుంది.
 
విశాఖపట్నం - దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాలను కలుపుతూ పయనించనుంది. దుర్గ్ ఉదయం 5.45కి బయల్దేరే రైలు రాయ్‌పూర్‌‍కు 6.08, మహాసముంద్ 6.38, ఖరియా రోడ్ 7.15, కాంతబంజి 8.00, తిత్లాగఢ్ 8.30, కేసింగా 8.45, రాయగడ 10.50, విజయనగరం 12.35, విశాఖపట్నం మధ్యాహ్నం 1.45కి చేరుకుంటుంది.
 
తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.50కి బయల్దేరే ఈ రైలు విజయనగరం 3.33కి, దుర్గ్‌కి రాత్రి 10.50కి చేరుకుంటుంది. 565 కి.మీ. దూరాన్ని ఈ రైలు 8 గంటల్లో చేరుకోనుంది.