గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (08:54 IST)

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆ మూడు జిల్లాలకు పెద్దపీట?

revanthreddy
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే, తనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే, మంత్రివర్గ కూర్పులో మూడు జిల్లాలకు పెద్ద పీట వేయనున్నట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. 
 
రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మొదటి విడతలో ఆ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి అవకాశం ఉంటే మాత్రం సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఛాన్సు దక్కవచ్చు. ఈ జిల్లా నుంచి రెండోసారి గెలిచిన దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తోంది. 
 
ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా ఆయన సతీమణి పద్మావతి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి మెదక్ నుంచి దామోదర రాజనర్సింహా, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్ లేదా వినోద్, ప్రేమసాగర్ రావుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎనిమిది మంది సీనియర్లకు మాత్రమే అవకాశం దక్కవచ్చు. 
 
అలాగే, ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంలో కూడా ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ఆర్థికశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. స్పీకర్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా శ్రీధర్ బాబు తిరస్కరించినట్లు తెలిసింది. భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టత రావాల్సి ఉంది. ఈయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించి రెవెన్యూ లేదా మరో శాఖ కేటాయించే అవకాశముంది. 
 
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నీటిపారుదల శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంచి మిగిలినవి భర్తీ చేయవచ్చనే అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదటిసారిగా ఎన్నికైన వారికి, ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వొద్దని ఏఐసీసీ నాయకులు రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలిసింది.