రూ.18లక్షలు స్వాహా.. హైదరాబాద్‌లో టెక్కీని నిమిషాల్లో కాపాడారు..
హైదరాబాద్‌లో టెక్కీని సైబర్ క్రైమ్ నుంచి పోలీసులు నిమిషాల్లో స్పందించారు. అంబర్ పేట్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈనెల 27న ఫెడెక్స్ కంపెనీ నుంచి ఓ కాల్ వచ్చింది.
కాల్లో తన ఆధార్ కార్డు ఉపయోగించి ముంబయి నుంచి ఇరాన్‌కు డ్రగ్స్ కొరియర్ అవుతున్నట్లు తెలిపారు. అనంతరం ముంబయి క్రైమ్ అధికారి అంటూ బాధితుడుకు స్కైప్ వీడియో కాల్ చేశారు.
అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని అతనిపై కేసు నమోదు అయిందని నకిలీ ఎఫ్ఐఆర్ను పంపించారు. అలాగే అతని అకౌంట్లో ఉన్న డబ్బును పంపిస్తే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వేరిఫై చేసి తిరిగి పంపిస్తామని సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించారు.
వారి మాటలు నమ్మి బ్యాంకు నుంచి రూ.18 లక్షలు అప్పు తీసుకున్నాడు. సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు ట్రాన్ఫర్ చేశాడు. ఆ డబ్బును సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపిన తర్వాత వారు కాల్‌ను కట్ చేశారు.
వెంటనే ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్విచ్ఛాప్ రావడంతో బాధితుడు తాను సైబర్ దాడిలో మోసపోయాయని తెలుసుకొని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అదే రోజు సాయంత్రం 6.58 గంటలకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేశారు.
వెంటనే ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు. బాధితుడి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన రూ.18 లక్షల నగదును రాత్రి 07.09 గంటలకు బ్లాక్ చేశారు. దీంతో బాధితుడు ఊపిరి పీల్చుకుని తన నగదు ఖాతాలో జమ అవుతాయన్న ఆనందంలో మునిగిపోయాడు. ఈ ఆపరేషన్ మొత్తం 11 నిమిషాల వ్యవధిలోనే సక్సెస్ అయింది.
సైబర్ ఆర్థిక మోసాలను నివేదించడానికి:
* సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ - 1930కి డయల్ చేయండి
* స్థానిక పోలీస్ స్టేషన్‌ని సందర్శించండి
* నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ – cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.