అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ... ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్ భేటీ!
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అత్యంత బిజీబిజీగా గడుపుతున్నారు. అనేకమంది పారిశ్రామికవేత్తలు, సీఈవోలను కలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ప్రయత్నిస్తున్నారు.
తాజాగా అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా బే ఏరియాలో జరిగిన బిజినెస్ కాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్‌ను కలిశారు. గత 40 ఏళ్లుగా అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, పలు అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు, బోర్డులతో కలిసి పనిచేసిన డాక్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యాచరణపై ఆసక్తి కనబర్చారు.
డాక్టర్ రామ్ చరణ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, టయోటా, నోవార్టిస్, జనరల్ ఎలక్ట్రిక్, యూఎస్ టీ గ్లోబల్, కేఎల్ఎం ఎయిర్‌లైన్స్, మ్యాట్రిక్స్ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు కన్సల్టెంట్‌గా పనిచేశారు. పలు కంపెనీలకు కన్సల్టెంట్‌గా ఉంటూనే డాక్టర్ రామ్ చరణ్ 30కిపైగా పుస్తకాలు రాశారు.
డాక్టర్ రామ్ చరణ్ అనుభవం తెలంగాణ పురోగతికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త్వరలోనే హైదరాబాద్ ను సందర్శించి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించి, అవి విజయవంతం అయ్యేందుకు అవసరమైన సూచనలు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ రామ్ చరణ్‌ను ఆహ్వానించారు.