శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2023 (18:14 IST)

హీరో అక్కినేని నాగార్జునను అరెస్టు చేయాలి : హైకోర్టులో పిటిషన్

Nagarjuna
బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన హీరో అక్కినేని నాగార్జునను అరెస్టు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ షో గ్రాండ్ ఫినాలే సందర్బంగా గొడవ జరిగింది. ఈ దాడి ఘటన పెద్ద వివాదాస్పదమైంది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు బిగ్ బాస్ నిర్వాహకుల వల్లే ఈ దాడి జరిగిందని, ఆయన పేరు ఎక్కడా లేదని, ఈ దాడి ఘటనకు నాగార్జునను కూడా బాద్యుడిని చేసి అరెస్టు చేయాలంటూ న్యాయవాది అరుణ్ విజ్ఞప్తి చేసారు. ఈ దాడి కారణంగా 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసమయ్యాయని, అందువల్ల హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునను కూడా అరెస్టు చేయాలని కోరుతూ ఆ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ఈ దాడి ఘ‌ట‌న‌లో బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు విచారణ జరిపిన అనంతరం ఈ దాడులకు ముఖ్య కార‌ణం పల్లవి ప్రశాంత్ అని తేల్చారు. 
 
దీంతో ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా(ఎ-1) కేసు నమోదు చేశారు. అలాగే అతని సోదరుడు, స్నేహితుడిని సైతం నిందితులుగా(ఎ-2, ఎ-3) నమోదు చేసి మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే వీరికి సంబంధించిన రెండు కార్లను సీజ్‌ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్ల‌డించారు.