ఇది పాతబస్తీ కాదు, ఇదే అసలు సిసలైన హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
“ఇది పాత బస్తీ కాదు. ఇదే అసలు సిసలైన హైదరాబాద్. ఈ హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ అభివృద్ధి మా బాధ్యత. ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అందుకు స్పష్టమైన హామీ ఇస్తున్నాం.” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతామని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు తప్ప మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ... పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్-2ను తీసుకొస్తున్నాం. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరిస్తున్నాం. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్‌ను ఏర్పాటు చేస్తాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. దీనికోసమే అక్బరుద్దీన్‌తో కలిసి లండన్ థేమ్స్ నగరాన్ని సందర్శించాం.
చంచల్‌గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తాం. గండిపేట నుంచి నగరంలోని 55 కి.మీల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు.