బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2024 (17:15 IST)

ఇద్దరు భార్యలు, ఒక ప్రియురాలు- అతడు పోలీసు దుస్తులు వేసి యువతకి రూ. 3 కోట్లు టోకరా

crime scene
అడ్డదారుల్లో డబ్బు లాగేయడం, నమ్మినవారిని ముంచేయడం, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేయడం... ఇలా మోసాలు చేయడం సమాజంలో కొందరు చేస్తుంటారు. ఐతే అలాంటివారి ఆటలు కట్టించేందుకు పోలీసువారు ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ఐనా కొంతమంది అమాయక ప్రజలు కేటుగాళ్ల చేతుల్లో మోసపోతూనే వుంటారు. తాజాగా ఇలాంటి ఘరానా మోసం బయటపడింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
 
విశాఖపట్టణం సమీపంలోని అడవివరం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి తన ప్రియురాలితో జత చేరి మెత్తగా మోసాలు చేయడం ప్రారంభించాడు. వీళ్ల మోసం ఎలాంటిదంటే... ఇద్దరూ పోలీసు దుస్తుల్లో వస్తారు. చూసినవారు నిజంగానే వీరు పోలీసు అధికారులేమోనని విశ్వసిస్తారు. వాళ్లకి కావల్సింది కూడా అదే. అలా నమ్మినవారితో తమకి పెద్దవాళ్లతో పరిచయాలు వున్నాయనీ, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకున్నారు.
 
ఇలా ఏకంగా రూ. 3 కోట్ల మేర మోసం చేసారు. ఆ తర్వాత విశాఖ నగరాన్ని వదిలేసి తమ మకాం హైదరాబాద్ నగరానికి మార్చేసారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసగాళ్లు హైదరాబాద్ నగరంలో వున్నారని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సురేష్ వద్ద విచారణ చేయగా తనకు ఇంతకుముందే ఇద్దరు భార్యలున్నట్లు తేలింది. ప్రస్తుతం ప్రియురాలితో కలిసి మోసాలు చేస్తున్నట్లు తేలింది.