రోడ్డు ప్రమాదం కేసు : బుల్లితెర నటుడు లోబోకు జైలుశిక్ష
గత 2018లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బుల్లితెర నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు కోర్టు ఒక యేడాది పాటు జైలుశిక్ష విధించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ కేసులో ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని జనగామ కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ తాజాగా తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2018 మే 21వ తేదీన టీవీ చానల్ తరపున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం వేయిస్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం తదితర ప్రాంతాల్లో పర్యటించింది.
ఈ క్రమంలో లోబో బృందం వరంగల్ నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్న సమయంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో చనిపోయారు. కారు కూడా బోల్తా పడటంతో లోతోబోపాటు అందులోని బృందం సభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు యేడాది జైలుశిక్షతో పాటు రూ.12500 అపరాధం విధిస్తూ జనగామ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.