రంగారెడ్డిలో సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్... వంద మందితో వచ్చి...
రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి సినీ ఫక్కీలో కిడ్నాప్‌కు గురైంది. ఏకంగా వంది మందితో వచ్చిన ఓ యువకుడు ఆ యువతిని కిడ్నాప్ చేశాడు. తనతో వివాహానికి యువతి తల్లిదండ్రులు సమ్మతించకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రంగారెడ్డి జిల్లాకు చెందిన ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతులకు ముచ్చెర్ల వైశాలి అనే 24 యేళ్ల కుమార్తె ఉండగా, ఈమె దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు. వీరంతా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ సిరి టౌన్‍షిప్‌లో ఉంటున్నారు.
అయితే, నవీన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఎత్తున యువకులను వెంటేసుకుని వచ్చి వైశాలిని కిడ్నాప్ చేసాడు. ఈ క్రమంలో దామోదర్ రెడ్డి ఇంటిలో బీభత్సం సృష్టంచారు. ఇంట్లోని ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు.
గతంలో నవీన్ రెడ్డి, వైశాలిలు ప్రేమించుకున్నారు. దీంతో వైశాలిని పెళ్లి చేసుకుంటానని నవీన్ చెప్పగా అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ కోపంతోనే నవీన్ రెడ్డి తన అనుచరులతో వచ్చి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది.
ఇదిలావుంటే వైశాలికి పెళ్లి చేసేందుకు ఇటీవలే ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని రోజుల్లో వీరి వివాహం జరగాల్సివుంది. ఇంతలోనే ఈ కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో నవీన్ రెడ్డి, వైశాలిలను గాలిస్తున్నారు.