గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (11:40 IST)

రైలు ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

train
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారి కారణంగా ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్ళను నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఈ రైళ్ళను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 
 
ముఖ్యంగా, సికింద్రాబాద్‌తో సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడుపుతామని తెలిపింది. పండగ రద్దీని నివారించేందుకు ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు ఇవి అదనమని తెలిపింది. ఈ రైళ్లు జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆయా నగరాల మధ్య నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు.
 
సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల నుంచి రాత్రి వేళ బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైళ్లను నడుపుతామన్నారు. ఇందులో జనరల్, రిజర్వుడ్, ఏసీ బోగీలు ఉంటాయని తెలిపారు. కాగా, సంక్రాంతి కోసం ఇప్పటికే 94 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇపుడు ప్రకటించిన ప్రత్యేక రైళ్ళతో కలుపుకుని మొత్తం ప్రత్యేక రైళ్ల సంఖ్య 124కు చేరింది.