సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (08:53 IST)

సికింద్రాబాద్ - విజయవాడల మధ్య వందే భారత్ పరుగులు

Bharat Express
దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ పలు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. ఇందులోభాగంగా, ఒక రైలును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన ఈ రైలును తొలుత సికింద్రాబాద్ - విజయవాడ స్టేషన్‌ల మధ్య నడిపాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. 
 
దేశంలో ఇప్పటికే ఐదు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. ఇపుడు ఇది ఆరో రైలు. ఈ రైలు గరిష్ట వేగం 180 కిలోమీటర్లు. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అంటే పగటిపూట మాత్రమే నడుపుతున్నారు. అందువల్ల తొలుత సికింద్రాబాద్ - విజయవాడ స్టేషన్ల మధ్య నడపాలని నిర్ణయించారు. 
 
భవిష్యత్‌లో బెర్తులతో కూడిన వందే భారత్ రైళ్లు రానున్నాయి. అపుడు విశాఖ వరకు ఈ రైలును పొడగించాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ - విజయవాడ స్టేషన్‌ల మధ్య నడిపే రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. 
 
అయితే ఈ రైలు సికింద్రాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య వెళ్లేందుకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి కాజీపేట మీదుగా, రెండోది నల్గొండ మీదుగా. కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్టం వేగం 130 కిలోమీటర్లు మాత్రమే. నల్గొండ మార్గంలో ఇది 110 కిలోమీటర్లుగా ఉంది. దీంతో వందే భారత్ రైలు కోసం ట్రాక్ సామర్థ్యాన్ని 180 కిమీకి పెంచాల్సి ఉంటుంది. ఈ చర్యలు త్వరలోనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి.