బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (08:09 IST)

టీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. బీజేపీలో చేరిన సీనియర్ నేత

గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అసంతృప్త నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, మాజీలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాషాయం కండువా కప్పేసుకున్నారు.

తాజాగా.. టీఆర్‌ఎస్‌ అల్లాపూర్‌ డివిజన్‌ సీనియర్‌ నేత పులిగోళ్ల శ్రీనివాస్‌ యాదవ్‌  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కార్యకర్తలతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. మాజీ కౌన్సిలర్‌ పన్నాల హరీష్‌ రెడ్డితో కలిసి శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడారు.
 
బీజేపీకి దినదినం ప్రజాదరణ పెరుగుతోందన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తానన్నారు. అల్లాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఎదిగిన శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు.

ఆయన బీజేపీ మెడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. డివిజన్‌లో క్రియాశీలకంగా పనిచేసి బీజేపీని మరింత బలోపేతం చేయాలని శ్రీనివాస్‌ యదవ్‌కు కాంతారావు సూచించారు.
 
బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్‌ కృష్ణగౌడ్‌   
ఫతేనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ముద్దాపురం కృష్ణగౌడ్‌ సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నాకు. నాంపల్లిలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్‌ జిల్లా  అర్బన్‌ అధ్యక్షుడు పన్నాల హరీ‌ష్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌ ఇతర బీజేపీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 
 
జీడిమెట్ల డివిజన్‌లో...
జీడిమెట్ల డివిజన్‌లోని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన కొందరు కార్యకర్తలు బీజేపీలో చేరారు. జీడిమెట్ల గ్రామం సమీపంలోని పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నాయకుడు గార్గే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వినోద్‌ కుమార్‌, సాయి, సంపత్‌, అనిల్‌కుమార్‌, సాయి, గోపిలతో పాటు 100 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.