శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (07:57 IST)

నోవాటెల్ వేదికగా అమిత్‌తో భేటీ అయిన ఎన్టీఆర్

ntr - amit shah
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం అమిత్ షాతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. అమిత్‌షాకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువా కప్పి ఎన్టీఆర్ సన్మానించారు. 
 
ఈ సందర్భంగా వారి మధ్య "ఆర్‌ఆర్‌ఆర్‌" సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నా.. అమిత్‌షా - జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు సమాచారం. 
 
అనంతరం అమిత్‌షా ఈ భేటీపై ట్వీట్‌ చేశారు. 'అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. తెలుగు సినిమా తారకరత్నం అయిన  జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, రాత్రి 11.16 వరకు ఎన్టీఆర్‌ నోవాటెల్‌ హోటల్‌లోనే ఉన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. 
 
తెలంగాణలో అధికారమే ధ్యేయంగా అడుగులు వేస్తోన్న బీజేపీ.. పలు రంగాల ప్రముఖులతో మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ అయినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.