శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (19:33 IST)

కొన్ని అధ్యాయాలు అంతే.. ముగింపు దశకు రాకముందే ముగిసిపోతాయి : బండి సంజయ్

bandi sanjay
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజన్‌ను తప్పించారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. దీంతో బండి సంజయ్ మంగళవారమే తన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. "కొన్ని అధ్యాయాలు ముంగిపు దశకు చేరుకోకముందే ముగిసిపోతుంటాయి" అంటూ పేర్కొన్నారు. తన పదవీకాలంలో పొరబాటున ఎవరినైనా బాధించివుంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని కోరారు. 
 
పైగా, తన పదవీకాలంలో విచారించదగ్గ ఘటనలేవీ లేకపోవడం సంతోషదాయకమన్నారు. అందరూ కూడా మర్చిపోలేని మధురానుభూతులు అందించారని తెలిపారు. అరెస్టుల సమయంలో, దాడులకు గురైన సమయంలో, ఉల్లాసంగా ఉన్న సమయంలో కూడా తనకు వెన్నంటి నిలిచారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
"నేను ఎప్పటికీ కార్యకర్తల్లో ఒకడినే. ఇకపైనా కార్యకర్తగానే ఉంటా. తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తా. పార్టీ అభ్యున్నతి కోసం ఆయనతో కలిసి నవ్యోత్సవంతో కృషి చేస్తాను" అని ఆయన మరో ప్రకటనలో పేర్కొన్నారు. తనలాంటి సాధారణ కార్యకర్తు పెద్ద అవకాశం ఇచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ అగ్రనేతలు బీఎల్ సంతోష్, శివప్రకాశ్, సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అర్వింద్ మీనన్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్‌‍లకు కృతజ్ఞతలు తెలిపారు.