శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం...
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ నిపుణులు, జాగిలాలతో తనిఖీలు చేసి, బెదిరింపు ఉత్తుత్తిదేనని తేల్చారు. దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈ మెయిల్ ద్వారా బెదిరించడంతో కలకలం రేగింది. సోమవారం ఉదయమే ఈ ఘటన జరుగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఉత్తుత్తిదే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ ఆధారంగా దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వైకాపా నేతల చెప్పినవారినే వాలంటీర్లుగా నియమించాం.. : మంత్రి ధర్మాన
ఏపీలోని అధికార వైకాపా నాయకత్వంపై పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల్లో అసంతృప్తి ఉందని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. వైకాపా శ్రీకాకుళం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా నియమితులైన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుతో పాటు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శ్రీకాకుళంలో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ, 'రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి సీఎం జగన్ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
వలంటీర్ల వ్యవస్థతో కార్యకర్తల చేతిలో ఉన్న అధికారాలు (చక్రం) తీసేశారనే ఆవేదన, బాధ మీ అందరిలో ఉంది. అది వాస్తవం. నేను కాదనను. ఇలా అయితే ప్రజల్లో పార్టీపై తప్పుడు భావం ఏర్పడే అవకాశం ఉంది. మీరంతా పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి. గ్రామంలో వైకాపా నాయకులు చెప్పిన పిల్లల్నే వాలంటీర్లుగా నియమించాం. వారి ద్వారానే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు.
పేదలకు మేలు చేయడంలో మీ సహకారం ఉందని, పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సంతోషించండి. నాకేమీ సంబంధం లేదనే భావనతో కార్యకర్తలు, నాయకులు ఉండొద్దు. పార్టీలో అందరికీ సరైన సమయంలో గుర్తింపు లభిస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.