వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు.. పాఠశాలలకు సెలవు రద్దు
తెలంగాణ విద్యా శాఖ వెనక్కి తగ్గింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులకు చూపించాలని భావించి, అందుకు తగిన విధంగా ఏర్పాట్లుచేసింది. కానీ, ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. దీనికి కారణాలను కూడా వివరించింది. బుధవారం పాఠశాలల పని వేళల్లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది.
కాగా, చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా, చంద్రుడి దక్షిణ ధృవాన్ని అధ్యయనం చేసే ల్యాండర్ విక్రమ్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై కాలుమోపనుంది. ఇస్రో దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ అపురూప ఘట్టాన్ని విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని నిర్ణయించిన విద్యాశాఖ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
అయితే, జాబిల్లిపై విక్రమ్ ల్యాండ్ అయ్యే సమయానికి, స్కూళ్లు విడిచిపెట్టే సమయానికి మధ్య భారీ తేడా ఉండడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సాధారణంగా పాఠశాలలు 4.30 గంటలకే ముగుస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను 6.30 గంటల వరకు స్కూళ్లలోనే ఉంచడం సరికాదని, దీనివల్ల దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తొలుత జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించింది. కావాలంటే గురువారం మధ్యాహ్నం యూట్యూబ్ ద్వారా చంద్రయాన్ ల్యాండింగ్ను చూపించవచ్చని తెలిపింది.