బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2023 (12:34 IST)

చంద్రయాన్-3: సేఫ్ ల్యాండింగ్ స్పాట్ కోసం కొనసాగుతున్న ‘విక్రమ్’ సెర్చ్, చంద్రుడిపై దిగేది ఎప్పుడంటే?

chandrayaan-3
చంద్రయాన్-3 ల్యాండర్ రేపు(2023 ఆగస్ట్ 23) సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కాబోతుంది. రేపటి నుంచి చంద్రుడి దక్షిణ ధ్రువంపై పగలు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.04 తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపై దింపేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. చంద్రుడి మీద విక్రమ్ దిగడానికి రెండు గంటల ముందు పరిస్థితిని పరిశీలిస్తామని, ల్యాండ్ చేయడానికి అనువైన పరిస్థితులు లేకపోతే 27వ తేదీన చంద్రుడిపై ల్యాండర్‌ను దింపాలని భావిస్తున్నట్లు అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ వెల్లడించారు.
 
ఈ నేపథ్యంలో చంద్రుడికి దగ్గరిగా వెళ్లిన చంద్రయాన్-3కి చంద్రయాన్-2 స్వాగతం చెప్పినట్లు ఇస్రో ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. ‘స్వాగతం, మిత్రమా!’ అంటూ చంద్రయాన్-3కి చంద్రయాన్-2 ఆర్బిటార్ స్వాగతం పలికిందని ఇస్రో తన ఎక్స్ లో వెల్లడించింది. ‘‘చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌కు చంద్రయాన్-2 ఆర్బిటార్ అధికారికంగా స్వాగతం పలికింది. ఈ రెండింటిలోని సమాచార వ్యవస్థలు అనుసంధానమయ్యాయి. ల్యాండర్ మాడ్యూల్‌ను చేరుకునేందుకు ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్కింగ్(ఐఎస్‌టీఆర్ఏసీ)కి చెందిన మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ (ఎంఓఎక్స్)కు మరిన్ని ద్వారాలు తెరుచుకున్నట్లు అయింది’’ అని తెలుపుతూ ఇస్రో ట్వీట్ చేసింది. మరోవైపు రేపు సాయంత్రం చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కాబోతుండటంతో, ఇస్రో ఈ ఈవెంట్‌ను భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.20 నుంచి లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
 
చంద్రయాన్-3 తీసిన ఫొటోలు షేర్ చేసిన ఇస్రో
ఇప్పటి వరకు ఏ దేశం దిగని, అన్వేషించని ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు మూడవ లూనార్ మిషన్ ప్రయత్నిస్తోందని భారతీయ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో పాటు మనమెప్పుడూ చూడని చంద్రయాన్-3 తీసిన చంద్రుడి ఆవలవైపు ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలను చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (LHDAC) తీసింది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌లను కూడా ఇస్రో షేర్ చేసింది. ఎలాంటి బండరాళ్లు, గుంతలు లేని సురక్షితమైన ల్యాండింగ్ ఏరియాను కనుగొనేందుకు ఈ ఫొటోలు తమకు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం చంద్రుని వద్దకు వెళ్లిన చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతోంది.
 
చంద్రుడిపై సూర్యరశ్మి కోసం ఎదురుచూస్తోన్న చంద్రయాన్-3
రెండవ, ఫైనల్ డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతంగా ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను 25 కి.మీ x 134 కి.మీలకు తగ్గించిందని ఇస్రో ఆదివారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్‌ను ల్యాండ్ చేసేందుకు చంద్రుడిపై అనువైన ప్రదేశంతో పాటు, సూర్యరశ్మి కోసం కూడా ఎదురుచూస్తోంది. చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయితే, ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలుస్తుంది. కాకపోతే, అమెరికా, మాజీ సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగానే భారత్ పేరులోకి వస్తుంది.
 
‘డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్’
ఈ ల్యాండింగ్ ప్రక్రియ అత్యంత సునిశితంగా, సంక్లిష్టంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. విక్రమ్ ల్యాండర్ దిగే ప్రాంతాన్ని ‘డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్’ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవడమే కారణం. ఇక్కడ ల్యాండర్, రోవర్లను దించడం ద్వారా.. అక్కడి మట్టిని పరిశీలించాలని ఇస్రో ప్రయత్నిస్తోంది. దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులను కనిపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి గడ్డకట్టిన పరిస్థితుల్లో చాలా అంశాలు నిక్షిప్తమై ఉంటాయి.
 
అంటే... సూర్య కుటుంబం పుట్టుక, చంద్రుడు, భూమి పుట్టుకల గురించిన రహస్యాలు, చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, ఏర్పాటయ్యే సమయంలో ఎలాంటి పరిస్థితులుండేవి వంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఈ సమాచారంతో చంద్రుడి పుట్టుకకు కారణాలు, దాని భౌగోళిక స్వరూపం, లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద మంచు అణువులు కూడా ఇక్కడ గడ్డకట్టిన నేలల్లో ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా.
 
చివరి నిమిషంలో రష్యా లూనా-25 క్రాష్
రష్యా లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ క్రాష్ అయిన ఒక రోజు తర్వాత ఇస్రో చంద్రయాన్-3 తీసిని ఫోటోలను బయటికి విడుదల చేసింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా తన లూనార్ మిషన్‌ను లాంచ్ చేసింది. అది కూడా భారత్ చంద్రయాన్-3 లాంచ్ చేసిన దాదాపు నెల తర్వాత లూనా-25 చంద్రుడి దిగేందుకు బయలుదేరింది. భారత్ కంటే ముందే లూనా-25 చంద్రుడిపై దిగాల్సి ఉంది. కానీ, ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి ప్రవేశించేటప్పుడు అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. దీంతో చివరి నిమిషంలో రష్యా వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్ కాకుండా చంద్రుడిపైన కూలిపోయిందని ఆ దేశ అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ తెలిపింది.
 
చంద్రుడి ఉపరితలంపై భారత చంద్రయాన్-3 ఎలా చేరుకుంటుంది?
చంద్రయాన్-3 భారత మూడవ లునార్ మిషన్. భారత్ ఇంతకు ముందు చేపట్టిన రెండు మిషన్లు కూడా విజయవంతమయ్యాయి. దీంతో చంద్రయాన్-3 కూడా విజయవంతమవుతుందని అంచనాలున్నాయి. చంద్రుడిపైకి చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని భారత్ తొలిసారి 2008 ఏడాదిలో ప్రయోగించింది. చంద్రయాన్-1 సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన ఇస్రో చంద్రుడి మీద నీరు ఉన్నట్లు ప్రకటించింది. ఈ సమాచారంతో చంద్రుడిపైన పగటి పూట వాతావరణం ఉన్న వాస్తవాన్ని గ్రహించారు.
 
ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-2ను 2019 జూలైలో ఇస్రో ప్రయోగించింది. కానీ, ఇది పాక్షికంగానే విజయం సాధించింది. కానీ, దీని ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ, దాన్ని అధ్యయనం చేస్తోంది. చంద్రయాన్ 2లోని ల్యాండర్-రోవర్‌లు సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే చివరి నిమిషంలో సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో పాక్షికంగానే ఇది విజయం సాధించింది. దీని నుంచి పాఠాలు నేర్చుకొని చంద్రయాన్-3 డిజైన్‌లలో ఇస్రో మార్పులు చేసింది. చంద్రయాన్-3లోని సాంకేతిక అంశాలను, ప్రమాదాలను భారత స్పేస్‌ ఏజెన్సీ ఒకదాని తర్వాత ఒకటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ప్రయోగాన్ని చేపట్టిందని ఇస్రో చీఫ్ శ్రీధర్ పానికర్ సోమనాథ్ అన్నారు.
 
చంద్రయాన్-3 బరువు 3,900 కేజీలు కాగా, దీని ఖర్చు సుమారు రూ.615 కోట్లు. ఇస్రో వ్యవస్థాపకులు విక్రమ్ పేరుతో రూపొందించిన ల్యాండర్ మోడ్యూల్‌ బరువు 1,500 కేజీలు కాగా, ప్రజ్ఞాన్ రోవర్ బరువు 26 కేజీలుగా ఉంది. ప్రజ్ఞాన్ అంటే సంస్కృతంలో జ్ఞానం అని అర్థం. ఇది చంద్రుడిపైన సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత, ఇది అంతా ఏర్పాట్లు చేసుకునేందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ముఖ్యమైన డేటాను, ఫోటోలను సేకరించి, వాటిని పరిశోధనల కోసం భూ ఉపరితలంపైకి పంపుతుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న భౌతిక లక్షణాలను, ఆ ఉపరితలంపై ఉన్న వాతావరణం గురించి తెలుసుకునేందుకు రోవర్ తన పరికరాలను కూడా తీసుకెళ్లింది. చంద్ర ఉపరితలం కింద ఏం జరుగుతుందో అధ్యయనం చేసేందుకు టెక్టోనిక్ యాక్టివిటీ కూడా చేపట్టనుంది.