ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ దిగడమే తరువాయి...

vikram lander
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3లో మరో కీలకఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవంతంగా శాస్త్రవేత్తలు పూర్తి చేసినట్టు ఇస్రో శనివారం అర్థరాత్రి తెలిపింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. 
 
ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్నీ అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణధ్రువంపై ఘనంగా కాలుమోపనుంది.  'రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి. మీx 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది' అని ఇస్రో ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించింది. 
 
రష్యా ల్యాండర్ లూనా-25లో సాంకేతిక సమస్యలు 
 
చంద్రుడి దక్షిణ ధృవం అధ్యయనం కోసం ఉన్నట్టుండి రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో దాని భవితవ్యంపై నీలి నీడలు అలుముకున్నాయి. ఈ సమస్యను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ తెలిపింది. 
 
ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ల్యాండింగ్‌కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్‌ ఆర్బిట్‌)కు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్‌కాస్మోస్‌ తెలిపింది. 
 
ఈ పరిస్థితుల్లో దాని ల్యాండింగ్‌ వాయిదా పడుతుందా అన్నదానిపై ఆ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యోమనౌక ఇప్పటికే చందమామకు సంబంధించిన ఫొటోలను అందించింది. లూనా-25ని ఈ నెల 11వ తేదీన రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి నింగిలోకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. 
 
దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లిపై ల్యాండింగ్‌కు రష్యా ప్రయత్నిస్తోంది. భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3.. ఈ నెల 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రదేశంలో దిగనుంది. లూనా-25 కూడా అదే ప్రాంతంలోని బొగుస్లావ్‌స్కీ బిలానికి చేరువలో 1-2 రోజుల ముందు దిగాల్సి ఉంది. ఇంతలోనే దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.