1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (16:41 IST)

ఈ ఒక్కసారికి క్షమిస్తున్నా.. ఫీల్డ్ అసిస్టెంట్లూ మళ్లీ తప్పు చేయొద్దు : సీఎం కేసీఆర్

ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరుణ చూపారు. వారు చేసిన తప్పును క్షమించి, తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా రెండేళ్ళ కిందట తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం వేల సంఖ్యలో ఉపాధి పథకంలో పని చేస్తూ వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని గుర్తుచేశారు. దీనికి కారణం లేకపోలేదన్నారు. బకాయిల చెల్లింపు, వేతనాల పెంపు, జీవో నంబరు 4779 రద్దు చేయాలన్న డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగారని చెప్పారు. ఫలితంగా 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గత రెండేళ్లుగా ఉపాధిని కోల్పోయారు. ఆ తర్వాత చేసిన తప్పును తెలుసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. 
 
కొన్ని రోజుల క్రితం కూడా వారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఓ ప్రకటన చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మరోమారు తప్పు లేదా పొరపాటు చేయొద్దని కోరారు. అదేసమయంలో సెర్ప్ ఉద్యోగులకు సైతం ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.