గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (09:12 IST)

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ!

kcrao
రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నిజానికి జాతీయ పార్టీని ఆయన ఈ నెలలోనే పార్టీ ప్రారంభించాలని భావించినా రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. 
 
రాష్ట్రపతి ఎన్నికలకు మూడు వారాలకుపైగా గడువు ఉన్నందున అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ప్రగతిభవన్‌లో శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రులు, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు, శాసనసభ, మండలి పార్టీ విప్‌లతో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశాన్ని నిర్వహించారు. 
 
కొత్త జాతీయ పార్టీ ఆలోచన గురించి చెప్పారు. ఈ నెల 19న తెరాస కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. దీనికి అనుగుణంగా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం సంప్రదించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలే ప్రధానాంశంగా ఉన్నందున కొత్త జాతీయ పార్టీని తర్వాత ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. 
 
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో చర్చించి, మద్దతుపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.