శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (11:38 IST)

పాలమూరులో డీసీసీబీ బ్యాంకు సిబ్బంది ఓవరాక్షన్

మూడు వాయిదాల రుణం చెల్లించలేదన్న కారణంగా డీసీసీ బ్యాంకు సిబ్బంది రుణదాత అయిన ఓ రైతు ఇంటి తలుపులు ఊడపీకారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ అనే రైతు తన 2.05 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకాన్ని గత 2021లో గూడూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో తాకట్టుపెట్టి రూ.4.50 లక్షల రుణం తీసుకున్నాడు.
 
ఒక్కో వాయిదాకు రూ.62 వేలు చొప్పున మరో నాలుగు నెలలు చెల్లించాల్సివుంది. అయితే, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో రూ.60 వేలు మాత్రమే చెల్లించాడు. మరో మూడు వాయిదాలు చెల్లించాల్సివుంది.

బ్యాంకు అధికారులు మాత్రం మిగిలిన రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించాడు. వాటికి ఆయన స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీన పోలీసులతో కలిసి డీసీసీబీ బ్యాంకు అధికారులు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రైతు మోహన్ కుమారుడు, మాజీ సర్పంచి అయిన ఆయన కోడలు స్వరూప ఉన్నారు. 
 
రుణం బకాయిలు చెల్లించని కారణంగా ఇంటి తలుపులు తీసుకెళ్తున్నట్టు వారికి చెప్పి ద్వారం నుంచి వాటిని తొలగించి వాహనంలో పడేశారు. ఈ క్రమంలో బ్యాంకు ధికారులకు, ఇంటి సభ్యులకు వాగ్వాదం జరింది.

మిగిలిన సొమ్ము త్వరలోనే చెల్లిస్తామని ప్రాధేయపడటంతో ఊడదీసిన తలుపులు తిరిగి అప్పగించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో డీసీసీబీ అధికారులు స్పందించారు. తాము రైతు కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించలేదని, మందలించి తలుపులు తిరిగి ఇచ్చేశామని తెలిపారు.