సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (08:47 IST)

ఊసరవెల్లిలా బీజేపీ?? ... రేపొద్దున తెరాసతో చేతులు కలిపితే మా పరిస్థితేంటి?

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి, తెరాస నేత ఈటల రాజేందర్ హస్తినకు వెళ్లారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన చర్చల్లో పలు సందేహాలు లేవనెత్తారు. 
 
తెలంగాణలో బీజేపీ, తెరాస ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని అన్నారు. భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే పార్టీనే నమ్ముకుని వచ్చిన తమలాంటి వారి పరిస్థితి ఏమిటని జేపీ నడ్డాను సూటిగా ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటివరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు. 
 
ఈటల సందేహాలకు నడ్డా బదులిచ్చారు. ఇందుకు పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ మూడు స్థానాల నుంచి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకు ఎదిగామని, తెలంగాణలోనూ అంతకుమించిన దూకుడు ప్రదర్శిస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామన్నారు.
 
కేంద్ర ప్రభుత్వ పథకాలను తొలుత విమర్శించే కేసీఆర్ ఆ తర్వాత వాటిని అమలు చేస్తున్నారని, అలా ఎందుకో ప్రతిపక్షాలే ప్రశ్నించాలని నడ్డా అన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌తో బీజేపీ పోరు కొనసాగిస్తుందని నడ్డా తేల్చి చెప్పారు.