శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (07:53 IST)

నేడు కాషాయం కండువా కప్పుకోనున్న ఈటల రాజేందర్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, తెరాస మాజీ నేత ఈటల రాజేందర్ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్ళనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు కాషాయ కండువా కప్పుకుంటారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం అవుతారు.
 
కాగా, తనతో కలిసి వస్తున్న నేతలతోపాటు బీజేపీ నాయకులను ఢిల్లీ తీసుకెళ్లేందుకు ఈటల రాజేందర్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. పార్టీలో చేరిన అనంతరం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. పార్టీలో చేరిక కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొంటారు. 

మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. కాగా, కొవిడ్‌ దృష్ట్యా 20 మంది ముఖ్య నేతలకు మాత్రమే పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుమతి ఉంటుందని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.