శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (08:55 IST)

ముహూర్తం ఫిక్స్... 13న బీజేపీలోకి ఈటల రాజేందర్

మాజీ మంత్రి, తెరాస మాజీ నేత ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన కాషాయం కండువా కప్పుకోనున్నారు. 
 
ఇటీవల తెరాస ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ఈటల రాజేందర్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన ఈ నెల 13న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన గత శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 
 
తద్వారా తెరాస పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8, లేదంటే 9వ తేదీల్లో బీజేపీలో చేరుతానని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా 13న బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.