తెరాసకు - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా : ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్ తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా ఈటల పలు ఆసక్తికర, సంచలన విషయాలను వెల్లడించారు. " అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై చర్యలు తీసుకున్నారు. రాత్రికి రాత్రే కేబినెట్ నుంచి నన్ను బర్తరఫ్ చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం నా వివరణ కూడా తీసుకోకుండా చర్యలు తీసుకున్నారు.
నా అనుచరులను బెదిరింపులకు గురిచేసినా తట్టుకొని నిలబడ్డారు. నాపై జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు. నాకు హుజురాబాద్ ప్రజలు ధైర్యం చెబుతున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా' అంటూ ప్రకటించారు. ఈటలతో పాటు ఈ మీడియా సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబయ్య ముదిరాజ్, ఇల్లంత కుంట ఎంపీపీ లతా శ్యామ్.. జమ్మికుంట మాజీ ఎంపీపీ ఉన్నారు.