శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (17:30 IST)

బెదిరిన ఎద్దులు... కాంగ్రెస్ నేతకు తప్పిన ప్రమాదం

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు భరించలేనంతగా ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్రం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. దీంతో పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీల నేతలు ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. 
 
దీంతో తెలంగాణా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మెదక్‌లోని ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 
 
చమురు ధరల పెంపును నిరసిస్తూ అక్కడికి ఎడ్లబండిని తీసుకొచ్చారు. ఆ ఎడ్లబండిపై మాజీ డిప్యూటీ సీఎం రాజనర్సింహ ప్రసంగిస్తుండగా ఊహించని ఘటన జరిగింది. కార్యకర్తలు, పార్టీ జెండాలు, మైకు శబ్దాలు.. ఆ హడావుడితో ఎడ్లు ఒక్కసారిగా బెదిరిపోయాయి. రాజనర్సింహ మాట్లాడుతుండగా ఎడ్లు బెదిరి భయంతో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాయి. 
 
కార్యకర్తలు, పార్టీ జెండాలు, మైకు శబ్దాలు.. ఆ హడావుడితో ఎడ్లు ఒక్కసారిగా బెదిరిపోయాయి. రాజనర్సింహ మాట్లాడుతుండగా ఎడ్లు బెదిరి భయంతో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాయి.
 
ఈ ఘటనలో ఎడ్ల బండిపై ఉన్న దామోదర రాజనర్సింహ అదుపు తప్పి కిందపడిపోయారు. అయితే అదృష్టవశాత్తూ కింద ఉన్న కార్యకర్తలు, నేతలు స్పందించడంతో ప్రమాదం తప్పింది. కిందపడటంతో మోకాలికి స్వల్ప గాయం అయింది. 
 
వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి ప్రమాదం ఏమీ లేదని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు గీతారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా అక్కడే ఉన్నారు.