1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెరాస విజయగర్జన సభకు స్థల సేకరణకు ఆటంకం.. ఎదురుతిరిగిన రైతులు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 యేళ్లు పూర్తికానుంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఇందులో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే, ఈ విజయగర్జన సభ కోసం తెరాస శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ, సభ జరిగే ప్రాంతానికి చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేక ఎదురువుతుంది. దీంతో తెరాస నేతలు షాక్‌‍కు గురయ్యారు. 
 
ఈనెల 29న హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో తెరాస "విజయ గర్జన సభ" సభ జరుగనుంది. ఇందుకోసం స్థల పరిశీలన కోసం వెళ్లిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. తమ స్థలాల్లో సభను నిర్వహించవద్దని స్థానిక రైతులు నేతల ముందు నిరసన వ్యక్తం చేశారు.
 
బుధవారం ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో పాటు పలువురు నేతలు సభ నిర్వహించే స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి చేరుకుని.. తమ ప్రమేయం లేకుండా సభ నిర్వహించడం, రాత్రికి రాత్రి చదును చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పంట పొలాలను ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. పంట చేతికి వచ్చే సమయంలో తమ స్థలాల్లో సభ నిర్వహిస్తే ఆర్థికంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. సభ కోసం అధికార పార్టీ నేతలు తమ స్థలాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 
 
ఏదో నామమాత్రపు నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటారని, చదును చేశాక తమ మధ్య స్థలాల పంచాయతీ ఏర్పడుతుందని, తమ మధ్య గొడవలు సృష్టించవద్దని నేతల ముందు మొరపెట్టుకున్నారు. నిరసన తెలుపుతున్న రైతులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నేత జగన్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి రైతులకు అండగా నిలిచారు. రైతులకు ఇష్టం లేకుండా దౌర్జన్యంగా పంట పొలాల్లో సభ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని టీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు.