1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (12:55 IST)

భాగ్యనగరంలో వరదలు.. మళ్లీ మూడు రోజులు వర్షాలు తప్పవ్

భాగ్యనగరంలో వరదలు పెరిగిపోతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మంగళవారం కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మొదలుకుని మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షం కురవగా సాయంత్రం నుంచి రాత్రి వరకు జోరుగా వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కేవలం మంగళవారం ఒక్కరోజే నగరంలోని పలు ప్రాంతాల్లో ఐదు సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
 
నగరంలో మంగళవారం కురిసిన వర్షానికి పాతబస్తీలోని హుస్సేనీ ఆలం, పురానాపూల్‌, దూద్‌బౌలి, ఖబూతర్‌ఖానా ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదనీరు పొంగిపొర్లింది. అంతే కాకుండా పురానాపూల్‌ శ్మశానవాటికతోపాటు శివాలయం నీటితో నిండిపోయింది. హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తేయడంతో పురానాపూల్‌ బ్రిడ్జి వద్ద భారీ ప్రవాహం కొనసాగింది. 
 
ఇటు సరూర్ నగర్‌ చెరువులోకి ఎగువ ప్రాంతాల చెరువుల నుంచి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సరూర్‌నగర్‌లోని లోతట్టు ప్రాంత కాలనీలైన కోదండరాంనగర్, సీసాల బస్తీ, వీవీ నగర్‌ ముంపు బాధితులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే ఉన్నారు.
 
వరదల్లో చిక్కకున్న ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే ఆయా కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఆనంద్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో దుప్పట్లు ఇవ్వకపోవడంతో రాత్రిపూట చలికి వణికిపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విడవకుండా కురుస్తున్న జోరు వర్షాలకు నగరంలోని 200వందల కాలనీలు నీటమునిగాయి. వర్షాభావం కాస్త తగ్గినప్పటికీ అవి ఇంకా ఆ వరదనీటిలోనే ఉన్నాయి. వరద తగ్గుముఖం పట్టినా 100పైగా కాల నీలు ఇంకా పూర్తిస్థాయిలో తేరుకోలేదు.