1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (08:32 IST)

తెలంగాణాలో కాంగ్రెస్ కర్నాటక ఎన్నిక ఫార్ములా - ఆరు హామీలతో సునామీ

sonia gandhi
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమికను పోషించిన కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తుంది. ఇందుకోసం కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఆరు ప్రధాన హామీలతో రాష్ట్రంలో సునామీ సృష్టించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు శాయశక్తులా పని చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్నాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. 
 
ఆదివారం హైదరాబాద్‌ నగరంలోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు పాల్గొని ఆరు ప్రధాన హామీలను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నారు.
 
ఈ సభలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలను పరిశీలిస్తే, 
 
మహాలక్ష్మి పథకం : ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం చేస్తారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం.
 
రైతు భరోసా : ఈ పథకం కింద రైతులకు, కౌలురౌతులకు ప్రతి ఏడాది రూ.15 వేలు. వ్యవసాయ కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు. వరిపంటకు క్వింటాల్‌ పై రూ.500 బోనస్ ఇస్తారు. 
 
గృహజ్యోతి : నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తారు.  200 యూనిట్లు దాటితేనే కరెంట్ బిల్లు వస్తుంది. 
 
ఇందిరమ్మ ఇళ్లు : ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు. ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు. తెలంగాణ కోసం పోరాడిన యోధులకు 250 చదరపు గజాల స్థలం.
 
యువ వికాసం : తెలంగాణలోని విద్యార్థులకు రూ.5 లక్షల విలువ చేసే విద్యా భరోసా అందిస్తారు. అలాగే, అన్ని మండలాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తారు.