శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: గురువారం, 6 మే 2021 (21:42 IST)

ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ, కొత్త పార్టీ పెడతారా?

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. మేడ్చల్‌లోని ఈటల నివాసంలో వీరిద్దరూ కలిశారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య సుధీర్ఘంగా చర్చ జరుగుతోంది. కొండా, ఈటల కలిసి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చర్చించేందుకే ఈటల రాజేందర్ ఇంటికి కొండా వెళ్లారని సమాచారం.
 
కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరి 2018 ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించలేదు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటలను కొండా కలవడంతో ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
ఇక దేవరయాంజల్ భూముల వ్యవహారంలో టీఆర్ఎస్ అధిష్టానం ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈటలపై అధికారపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే ఈటల ఒక్కరిపైనే కాదు.. టీఆర్ఎస్‌లో భూకబ్జాలకు పాల్పడిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈటల పార్టీ మారితే తమ తమ పార్టీల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నాయి.