శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (13:02 IST)

అక్టోబరు లేదా నవంబరు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు

Ghmc Election
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఇందులోభాగంగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే అక్టోబరు లేదా నవంబరు నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ప్రక్రియను బల్దియాలోని ఎన్నికల విభాగం ప్రారంభించింది. ఇందులోభాగంగా ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ఎల్సీ)కు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 12న విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఎఫ్ఎల్సీ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని, నేడు తేదీపై స్పష్టత వస్తుందని ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. 
 
ప్రస్తుతం జీహెచ్ఎంసీ గోదాంలో 20 వేల వరకు ఈవీఎంలున్నాయి. ఇందులో 8 వేలు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు 6 వేలు, వీవీ ప్యాట్ మిషన్లు 6 వేల వరకు ఉన్నాయి. వీటి పని తీరు ఎలా ఉందన్నది. ఎఫ్ఎల్సీలో భాగంగా ఈసీఐఎల్ నుంచి వచ్చే ఇంజనీరు పరిశీలిస్తారు. కొన్ని ఈవీఎంలలో 1,500, మరికొన్నింటిలో 300, 400, 500 ఇలా.. వేర్వేరు సంఖ్యలో సిబ్బందితో ఓట్లు వేయిస్తారు. 
 
గుర్తుల వారీగా ఓట్లు పోల య్యాయా..? లేదా..? అన్నది పోలింగ్ అనంతరం పరిశీలిస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పులనూ లెక్కిస్తారు. సక్రమంగా పని చేసిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామని, సమస్య తలెత్తిన వాటిని మరమ్మతు కోసం పంపిస్తామని ఓ అధికారి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. ఆగస్టు 2న ఓటర్ ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అక్టోబర్ 11న తుది జాబితా వెలువడనుంది.