శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:12 IST)

పెండింగ్ చలాన్లు చెల్లిస్తే డిస్కౌంట్ : హైదరాబాద్ పోలీసుల ప్రకటన

వాహనదారులకు హైదరాబాద్ నగర పోలీసులు శుభవార్త చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించిన అపరాధ రుసుంను చెల్లించని వారికి ఈ వార్త చాలా మేలుచేస్తుంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి రాయితీని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మార్చి ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 
 
ఇందులోభాగంగా, ద్విచక్రవాహనదారులకు 25 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు. ఈ అపరాధాన్ని ఆన్‌లైన్ లేదా మీసేవా గేట్‌వేలలో చెల్లించే అవకాశం ఉంది. 
 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 600 కోట్ల మేరకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు మార్చి నెలలో స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టాలని నిర్ణయించారు.