1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (18:10 IST)

తెలంగాణాను ముంచెత్తుతున్న వర్షాలు.. రెడ్ అలెర్ట్

Rains
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు కూడా వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా, ఆదివారం అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. దీంతో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 
 
శనివారం కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, పొరుగు జిల్లాలు రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి.
 
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జిల్లాలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లిలోని ముత్తారం మహదేవ్‌పూర్‌లో 34.7, కాటారంలో 34, మహదేవ్‌పూర్‌లో 24 సీఎం వర్షపాతం నమోదైంది. మంచిర్యాల్, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ లలో 22 సెంటీమీటర్ల నుంచి 23 సిఎం వరకు భారీ వర్షం కురిసింది.
 
జయశంకర్ భూపాలపల్లిలో కురుస్తున్న భారీ వర్షాలకు కాటారం-మహదేవ్‌పూర్, దామరకుంట-కటకుపల్లి రోడ్లపై వర్షం నీరు ప్రవహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా చింతకానివాగు నీరు కాటారం-మేడారం రహదారిపై పొంగి ప్రవహిస్తుండగా కొండంపేటవాగు నీరు మంథని-కాటారం రహదారిపైకి చేరింది.
 
కొయ్యూరు రహదారిపై వరదనీరు పోటెత్తడంతో పలు వాహనాలు నిలిచిపోయాయి. బొప్పారం, చిందేవ్‌పల్లి, శ్రీనివాస్‌ కాలనీలోని ఇళ్లలోకి వర్షం నీరు చేరింది.
 
మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో స్థిరంగా ఉంది. నివేదికల ప్రకారం, గత 24 గంటల్లో ప్రాజెక్ట్‌లోకి 14 టీఎంసీల ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1078 అడుగుల నీటిమట్టం ఉంది.
 
అలాగే, కామారెడ్డిలోని నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా 5980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 1405 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు గాను 1329 అడుగులుగా ఉంది. 
 
నిర్మల్‌లోని కడెం ప్రాజెక్టుకు 59,716 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో నీటిపారుదల శాఖ అధికారులు నాలుగు గేట్లను తెరిచి 23,297 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.
 
పెద్దపల్లి, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద భారీగా ఇన్ ఫ్లో వచ్చింది. ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15.05 టీఎంసీల నిల్వ ఉంది. 

పాఠశాలలకు మూడు రోజుల సెలవు 
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా అనేక జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పైగా, వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై, ముందు జాగ్రత్త చర్యగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
 
సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యలో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశంచేశారు.