స్కూళ్ల నుంచి యూనివర్శిటీలకు పాకిన కరోనా.. ఉస్మానియాలో 400మందికి..?
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. ఓయూ అమ్మాయిల వసతిగృహంలో ఇద్దరు పీజీ విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. వారిద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోఠి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఓయూ లేడీస్ హాస్టల్లో 400 మంది విద్యార్థినులు ఉన్నారు.
అటు నగరంలోని పలు స్కూళ్లు, హాస్టళ్లలోనూ కరోనా తీవ్రతరం అవుతుండడం అధికారులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. రాజేంద్రనగర్‌లోని ఎస్టీ బాలుర హాస్టల్‌లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే బండ్లగూడ మైనారిటీ గురుకుల పాఠశాలలో 38 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఇతర జిల్లాలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. కాగా జగిత్యాల బీసీ సంక్షేమ వసతిగృహంలో 17 మంది బాలికలకు కరోనా సోకింది.