శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (12:02 IST)

బోనాలు ఎఫెక్టు : భాగ్యనగరిలో మద్యం షాపులు బంద్

తెలంగాణా రాష్ట్రంలో బోనాల పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంపై దృష్టిసారించారు. 
 
ఈ నేపథ్యంలోనే ఆదివారం, సోమవారాల్లో హైదరాబాద్‌ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, అలాగే బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఆబ్కారీ శాఖ అధికారులు ప్రకటించారు. 
 
బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, మరియు రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ తాజా నిర్ణయంతో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి.