శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:01 IST)

మెట్రో రైలులో సక్సెస్‌ఫుల్‌గా 'గుండె జర్నీ'... ఎక్కడ.. ఎలా?

హైదరాబాద్ మెట్రో చరిత్రలో తొలిసారిగా గుండెను తరలించారు. గుండె దాత ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో ఉంటే.. స్వీకర్త జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ రెండు ఆస్పత్రుల మధ్య దూరం 27.5 కిలోమీటర్లు. హైదరాబాద్‌లో రోడ్డు మార్గంలో ఈ దూరం చేరాలంటే సమయాన్ని ఊహించలేం. సాయంత్రం 4 గంటల తర్వాత నగరంలో రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నిలిపి గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటుచేయాలంటే తలకుమించిన భారమే. దీంతో పోలీసులు మెట్రో అధికారులతో కలిసి రోడ్డు, మెట్రో మార్గాల్లో గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటుచేశారు. ఫలితంగా విజయవంతంగా మెట్రోలో గుండెను తరలించారు. ఓ రోగి ప్రాణాలు కాపాడారు. ఇది హైదరాబాద్‌ మెట్రో చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నల్లగొండ జిల్లాకు చెందిన రైతు నర్సిరెడ్డి (45) బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కామినేని దవాఖానలో ఆయన గుండెను సేకరించి జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చడానికి వైద్యులు నిర్ణయించి ఏర్పాట్లు కూడా చేశారు. 
 
అయితే, రెండు ఆస్పత్రుల అధికారులు పోలీసులను సంప్రదించి ఇందుకు ఏర్పాట్లుచేయాలని కోరారు. సాయంత్రం సమయంలో నగరంలో ట్రాఫిక్‌ తీవ్రంగా ఉండటంతో గుండె తరలింపులో జాప్యం జరుగవచ్చని భావించిన పోలీసులు.. మెట్రో అధికారుల సహకారం తీసుకున్నారు. తొలిసారిగా మెట్రో అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా రోడ్డు, మెట్రో మార్గాల్లో గ్రీన్‌చానల్‌ ఏర్పాటుచేశారు. 
 
సాయంత్రం 4.33 నిమిషాలకు ఎల్బీనగర్‌ కామినేని నుంచి గుండెను భద్రపర్చిన బాక్సుతో ప్రత్యేక అంబులెన్స్‌లో బయలుదేరిన అపోలో వైద్యుల బృందం 4.38కి నాగోల్‌ మెట్రోస్టేషన్‌కు చేరుకున్నది. అక్కడ నుంచి మెట్రో రైలులో 4.45 నిమిషాలకు బయలుదేరి 21 కిలోమీటర్ల మేర మెట్రోమార్గంలో 16 స్టేషన్లను నాన్‌స్టాప్‌గా దాటుకుంటూ 5.11 గంటలకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మెట్రోస్టేషన్‌కు చేరుకుంది. 
 
అక్కడ్నుంచి 5.13 గంటలకు మళ్లీ రోడ్డుమార్గంలో అంబులెన్స్‌ ద్వారా 5.15 గంటలకు అపోలో దవాఖానకు గుండెను చేర్చింది. మొత్తం 45 నిమిషాల్లో విజయవంతంగా గుండెను తరలించారు. ఆ తర్వాత అపోలో ఆస్పత్రి హృద్రోగ వైద్య నిపుణుడు డాక్టర్‌ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం ఈ గుండెమార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.