బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:19 IST)

కాలేజీ - మహిళా ఉద్యోగులే టార్గెట్.. ఆటో ఎక్కగానే కిడ్నాప్.. ఆపై మత్తిచ్చి అత్యాచారం..

హైదరాబాద్ శివారులోని కీసరలో ఇటీవల జరిగిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు విషయం తెలియకుండా హత్య చేయాలని భావించారు. అయితే అప్పటికే పోలీసులు వస్తున్న విషయం తెలిసి ఆమెను వదిలి పరారయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 19 యేళ్ళ యువతి బుధవారం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కళాశాల వద్ద ఆటో ఎక్కింది. కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆటోలో అప్పటికే ఉన్న వృద్ధురాలు, పాప దిగిపోయారు. ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్లగానే ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. ఇంతలో విద్యార్థిని దిగాల్సిన ఆర్ఎల్ఆర్ నగర్ స్టేజీ వచ్చినా ఆటోను ఆపలేదు. 
 
ఆమె అరిచేలోగానే ఆటోలో అప్పటికే ఎక్కి కూర్చున్న ఇద్దరు యువకులు ఆమె నోరు నొక్కి పట్టుకున్నారు. ఆటో ఘట్‌కేసర్ మండలంలోని యంనంపేట రాగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్‌లోకి ఆమెను ఎక్కించారు. యువతి చాకచక్యంగా తన వద్దనున్న ఫోన్‌తో కిడ్నాప్‌కు గురైనట్టు తల్లికి సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా యంనంపేట చేరుకున్నారు.
 
యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విషయం తెలుసుకున్న వ్యాన్, ఆటో డ్రైవర్లతోపాటు ఆటోలో ఎక్కిన ఇద్దరు యువకులు యువతిని వ్యాన్ నుంచి దించి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కర్రలతో దాడి చేశారు. అదేసమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆమెను వదిలి దుండగులు పరారయ్యారు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఇందులో అనేక నిజాలు వెలుగుచూశాయి. 
 
ఆ విద్యార్థిని ఎక్కిన ఆటోలోనే యనంపేట వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కి, ఆమెకు చెరోపక్క కూర్చున్నారు. మరో వ్యక్తి ఘట్‌కేసర్ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆటో అక్కడికి చేరుకోగానే బాధిత యువతిని అందులోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. 
 
అయితే, అప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేశారని, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మైక్‌లో చేస్తున్న అనౌన్స్‌మెంట్ నిందితులకు వినిపించింది. దీంతో దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారని భావించిన నిందితులు యువతిని వ్యాన్ నుంచి కిందికి దించి పక్కనే ఉన్న పొదల్లో పడేసి పరారయ్యారు.
 
సెల్ సిగ్నల్ ఆధారంగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
 
కాగా, విచారణలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరికీ నేరచరిత్ర ఉందని,  కాలేజీ, ఉద్యోగాలకు ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు తెలిపారు. ఓ 15 రోజులపాటు వారిని గమనించిన తర్వాత ప్రణాళిక అమలు చేస్తారని వివరించారు. 
 
కిడ్నాప్ చేసిన అనంతరం తమకు సహకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. గతంలో మరో నలుగురు మహిళలపైనా అత్యాచారానికి తెగబడినట్టు నిందితులు అంగీకరించారు.